>>
>> హ్యూమర్ ఫ్లస్
>>
>> జీవితంలో చేదు, వగరు, పులుపే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా తీపి తగిలే టైం
>> వస్తే అప్పుడు మనకు సుగరొస్తుంది. ఈ సత్యం తెలిసే మనకు ఉగాది పచ్చడి పెడతారు.
>> నిజానికి మనం టెక్నాలజీ రుచి మరిగి అసలు రుచుల్ని గుర్తుపట్టే స్థితిలో లేము.
>> ఒకాయనకి ఫేస్‌బుక్ చూస్తూ భోంచేయడం అలవాటు. లైక్‌లు కొట్టికొట్టి అలసిపోయి
>> చెయ్యి కడుక్కుంటాడు. చికెన్ చాలా బావుందని భార్యకి చెబుతాడు. ఆమె వాట్సాప్
>> మెసేజ్‌ల్లో ఇరుక్కుపోయి థ్యాంక్సండీ అంటుంది. నిజానికి అతనేం తిన్నాడో అతనికి
>> తెలియదు. ఏం వండిందో ఆమెకి గుర్తులేదు.
>>
>> ఇంకొకాయన సన్నాసుల్లో కలిసిపోయాడు. ఈయన దగ్గర సెల్‌ఫోన్ వున్నందువల్ల తమలో
>> కలుపుకోవడానికి సన్నాసులు నిరాకరించారు. భార్య తనతో ఫేస్‌బుక్‌లో తప్ప ఫేస్ టు
>> ఫేస్ మాట్లాడ్డం లేదని అలిగి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏరోజుకారోజు భర్త తన
>> ప్రొఫైల్ పిక్చర్ అప్‌డేట్ చేస్తే తప్ప అతన్ని ఆమె గుర్తుపట్టలేదు. చేతిలో
>> సెల్‌ఫోన్ లేకుండా కనిపిస్తే ఆమెను అస్సలు అతను గుర్తుపట్టలేడు.
>>
>> అతనికోసం ఆమె వెతక్కుండా ఫేస్‌బుక్ పోస్టింగ్ పెట్టింది. చూసి
>> చూడనట్టున్నాడు. ఒకరోజు జుత్తు విరబోసుకున్న ఫోటోని అప్‌డేట్ చేసేసరికి శ్మశాన
>> వైరాగ్యం ఆవరించి సెల్‌ని చితకబాది కాశీలోని హరిశ్చంద్ర ఘాట్‌లో సెటిలైపోయాడు.
>> ‘ఇల్లు ఇల్లనేవు, సెల్లు సెల్లనేవు చిలకా’ అని పాడుతూ ఎవరికో కనిపించాడట. భర్త
>> ఈరకంగా కాశీమజిలీ యాత్ర చేశాడని ఆమె పోస్టింగ్ పెడితే రెండొందలమంది లైక్
>> కొట్టారు. మొగుడ్ని సన్యాసుల్లో కలిపే చిట్కా వివరించమని కోరుతూ ఐదొందలమంది
>> వాట్సప్ మెసేజ్‌లు పెట్టారు.పల్లెటూళ్లలో కూడా సోషల్ మీడియా వచ్చేసింది. ఫలానా
>> సుబ్బమ్మకి చాలా టెక్కులు అని పోస్టింగ్ పెడితే అన్నివర్గాల వారు లైక్‌లు నూరి
>> కామెంట్లు అతికిస్తున్నారు. కుళాయిల దగ్గర కొట్టుకోవడం మానేసి వాట్సప్
>> గ్రూపుల్లో యుద్ధం చేస్తున్నారు.
>>
>>
>> ఎండల దెబ్బకి ఈసారి కవుల గొంతు కూడా మూగబోయేలా ఉంది. గొంతు సవరించుకునేలోగా
>> దాహమేసి నీళ్లు తాగేస్తున్నారు. గతంలో కవిత్వం చదివి శ్రోతల చేత మూడు చెరువుల
>> నీళ్లు తాగించేవాళ్లు కూడా ఈసారి సేఫ్‌సైడ్‌గా వాయిస్‌మెయిల్‌ని
>> ఆశ్రయిస్తున్నారు.కవిత్వాన్ని మెయిల్ చేస్తే అవతలివాళ్లు దాన్ని జాగ్రత్తగా
>> డౌన్‌లోడ్ చేసి సమ్మేళనాల్లో వినిపిస్తున్నారు. శ్రోతలు వహ్వా అనకపోయినా,
>> నిర్వాహకులే ముందస్తుగా వహ్వాలు రికార్డు చేసి, అవతలిపక్షానికి డౌన్‌లోడ్
>> చేయిస్తున్నారు. నిజానికి కవుల గొంతు లోడ్ చేసిన తుపాకీ లాంటిది. ట్రిగ్గర్
>> నొక్కితే పశుపక్ష్యాదులు కూడా కకావికలే.
>>
>>
>>
>> ఈ పొల్యూషన్‌కి కోయిలలకి కూడా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. పాడ్డం
>> మానేశాయి. కనపడుతున్నట్టు కూడా లేదు. లేదంటే ఫేస్‌బుక్స్ వాళ్లు విజృంభించి
>> ఫోటోలు పెట్టేవాళ్లు. ఉగాదినాడు ఎవరి పంచాంగాలు వాళ్లు చదువుకుంటారు. అందరికీ
>> అన్నీ శుభాలే జరుగుతాయంటారు. పులికి, మేకకి ఏకకాలంలో శుభం జరగడం అసాధ్యం.
>> దేవుడు ఎప్పుడూ ఒకరిపక్షానే ఉంటాడు. ఎక్కువసార్లు పులిపక్షంలో ఉంటాడు. కనపడని
>> పులితో జూదమాడ్డమే పులిజూదం.
>>
>> మాటలన్నీ మాయమై మెసేజ్‌లుగా మారిపోతున్నాయి. అన్నిటినీ గూగుల్ సెర్చ్‌లో
>> వెతుక్కునే మనం, ఏదో ఒకనాడు మనల్ని మనమే వెతుక్కుంటాం. వెతుక్కున్నా దొరకం.
>> మనల్ని మనం గుర్తుపట్టలేకపోవడమే మాడ్రన్ లైఫ్. ఎప్పుడో ఒకరోజు పండగ రావడం కాదు.
>> ఎప్పుడూ పండగలా జీవించడమే నిజమైన ఉగాది.
>>
>> - జి.ఆర్. మహర్షి
>>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి